Cotton crops damage Warangal 2023 : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా అధిక మెుత్తంలో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వరుస వర్షాలతో చేలలో నీరు చేరి పంట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మెుక్క ఎదిగే స్థాయిలోనే ఎర్రబడి చనిపోతుందని రైతులు చెబుతున్నారు. చాలా చోట్ల వరదకు ఇసుక మేటలు వేసి పత్తి పంట కొట్టుకుపోయిందని తెలిపారు.
crops damage in Warangal : వర్షాకాలంలోనూ ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో... రైతులు పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలను నాటారు. వర్షం కోసం ఎదురుచూసిన సకాలంతో పడకపోవడంతో విత్తనాలను మొలకెత్తించేందుకు నానా తంటాలు పడ్డారు. ఒక్కొ రైతు రెండు నుంచి మూడుసార్లు పత్తి విత్తనాలను నాటామని ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి మొలకెత్తినప్పటికీ వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటలోకి నీరు నిల్వ ఉండి పంటను దెబ్బతీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
''వర్షాకాలంలో కూడా ఎండలు ఎక్కువగా ఉండటంతో పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలను నాటాను . వర్షం కోసం ఎదురుచూసినా సకాలంతో పడకపోవడంతో విత్తనాలను మొలకెత్తించేందుకు నానా తంటాలు పడ్డాము. మూడు సార్లు విత్తనాలు వేశాం. తీరా పత్తి మొలకలు మొలకత్తే సమయంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటలోకి వరద చేరి పంటను పాడుచేస్తోంది. నాలుగు ఎకరాల్లో పత్తి వేశాను. పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతుంది. ఇప్పటికైనా వర్షాలు ఆగితే మేలు జరుగుతుంది.'' - పత్తి రైతు
గతేడాది ఈ సమయానికి చెట్లు ఒకింత కొమ్ములు వేశాయని, ప్రస్తుతం పంటకాలం ఆలస్యంగా మెుదలవడంతో ఇంకా కొన్నిచోట్ల విత్తనాలు నాటే పరిస్థితే నెలకొందంటున్నారు రైతులు. వర్షం ఇలాగే కొనసాగితే బిడస వారి పత్తి మొక్క ఎరుపు రంగులోకి మారి ఎదుగుదల లోపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
''ఇన్ని రోజులు వర్షాలు లేటుగా రావటం వలన నెల రోజులు లేటుగా విత్తనాలు వేశాము. మొలకెత్తే సమయంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వల్ల నీరు నిల్వ ఉండి పత్తి మొక్కలు ఎరుపు రంగులోకి మారి ఎదుగుదల లోపిస్తుంది. ఈ సంవత్సరం పత్తి పంటలు బాగా దెబ్బతిని నష్టం వాటిల్లింది.'' - పత్తి రైతు
ఇవీ చదవండి..