ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు మూడు గంటల పాటు ఉన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహం ఎస్వీఎస్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు కుమారై డాక్టర్ హర్షిణితో గురువారం వివాహం జరిగింది. రాత్రి 8.21 గంటలకు రామవరంలోని ఎస్వీఎస్ విద్యా సంస్థల కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికారు. వివాహ వేడుకలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాఠోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, రెడ్యానాయక్, రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్, గోపాల్, గండ్ర వెంకటరమణారెడ్డి, సతీశ్, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి, తెరాస రాష్ట్ర నాయకులు కేశవరావు, వికలాంగుల సంక్షేమశాఖ ఛైర్మన్ కె.వాసుదేవారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
పర్యటన ఇలా..
- సాయంత్రం 5:55 గంటలకు..హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్నారు.
- 5:58 మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.
- 6:00 కళాశాల మైదానం నుంచి కాన్వాయి బయలుదేరింది.
- 6:06 హంటర్‌రోడ్డులోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకున్నారు.
- రాత్రి 7:43 వరకు.. స్థానిక నేతలతో వివిధ అంశాలపై చర్చించారు.
- 7:45 కెప్టెన్ నివాసం నుంచి రామవరం బయలుదేరారు.
- 8:01 ఎస్‌వీఎస్ కన్వన్షన్ హాల్‌కు వచ్చారు.
- 8:47 నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- 8:51 అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్‌కు వెళ్లారు.