కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రభుత్వాసుపత్రుల్ని సందర్శించి... కరోనా బాధితులకు భరోసానిస్తున్న సీఎం కేసీఆర్... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పర్యటించారు. కొవిడ్ రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సహా ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో వార్డులను సందర్శించిన కేసీఆర్... కొవిడ్ బాధితుల్ని ఆప్యాయంగా పలకరించారు. వైద్యసేవలు, భోజనం, సౌకర్యాల గురించి ఆరా తీశారు. రోగులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని... పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. ధైర్యంగా ఉండాలని... ప్రభుత్వం అండగా ఉంటుందని కరోనా రోగులకు సీఎం కేసీఆర్ మనోధైర్యం ఇచ్చారు.
వైద్యులు, ఆరోగ్యసిబ్బంది అందిస్తున్న సేవలు... ఎనలేనివని
వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా రోగి వెంకటాచారి... తనకు చికిత్స బాగానే అందుతోందని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అంటూ బిగ్గరగా అరిచారు. బుధవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సందర్శించిన కేసీఆర్... అదే కోవలో ఎంజీఎంను పరిశీలించారు. ఎంజీఎంలో ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. విపత్కర సమయంలో వైద్యులు, ఆరోగ్యసిబ్బంది అందిస్తున్న సేవలు... ఎనలేనివని సీఎం కొనియాడారు. వైద్యారోగ్య సిబ్బందికి ఎదరవుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఖర్చయినా సరే.... రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని.... వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
73 ఎకరాల్లో... ఆధునాతన సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి
ఎంజీఎం ఆస్పత్రి తర్వాత తెరాస ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు నివాసానికి వెళ్లిన సీఎం..... అక్కడ భోజనం చేసి.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం... వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. అక్కడ ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల్ని పరిశీలించారు. ఎంజీఎంకు రోగుల తాకిడి ఎక్కువ అవుతుండంతో... సమీపంలోనే ఉన్న సెంట్రల్ జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో... ఆధునాతన సౌకర్యాలతో కొత్త ఆస్పత్రిని నిర్మించేందుకు ఇప్పటికే సీఎం ఆమోదం తెలిపారు. ఈమేరకు కారాగారాన్ని పరిశీలించిన సీఎం... ఆస్పత్రి నిర్మాణం, జైలు తరలింపుపై అధికారులతో చర్చించారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని మామ్‌నూర్ లేదా ధర్మసాగర్‌కి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు