CM KCR on World Heritage Day 2023: ఎంతో విశిష్టమైన చారిత్ర వారసత్వ సంపద తెలంగాణ గడ్డకే సొంతమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రస్తానాన్ని సీఎం స్మరించుకున్నారు. శాతవాహన వంశం నుంచి మొదలు అసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని వ్యాఖ్యానించారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, యాస, సాహిత్యం వారసత్వ సంపదకు ఆలవాలం అన్నారు.
తెలంగాణ వారసత్వ సంపద: 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం సాగిందనడానికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీనమానవుని పెయింటింగ్స్ నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పద్మాక్షిగుట్ట, మెదక్ చర్చి, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు.. తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేటలోని, ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం కేసీఆర్ కొనియాడారు.
World Heritage Day 2023: మరోవైపు.. చారిత్రక సంపదకు నిలయమైన రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ వేడుకలకు ముస్తాబైంది. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో జరిగే కార్యక్రమాలు సాయంత్రం నుంచి జరగనున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.
రామప్ప చరిత్ర: ఎంతో మంది పర్యాటకుల మనసును దోచుకున్న రామప్ప దేవాలయానికి ఎంతో విశిష్టతమైన చరిత్ర ఉంది. తెలంగాణను కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో కాకతీయ చక్రవర్తి రేచర్ల రుద్రుడి కాలంలో క్రీ,శ. 1213లో ఈ రామప్ప దేవాలయం అత్యద్భుతమైన కళాఖండాలతో నిర్మితమైంది. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంలో రూపుదిద్దుకుంది. కఠిన శిలలపై.. కారుణ్యం ఒలకపోసే విగ్రహాలు.. దేవతామూర్తులు.. నీటిలో తేలియాడే రాళ్లతో నిర్మించిన ఆలయ పై కప్పు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలయం ఈ కట్టడం. కట్టిన శిల్పి పేరు మీదగానే రామప్ప దేవాలయంగా పేరు గడించింది. ఇప్పుడు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడంతో విశ్వవ్యాప్తమైంది.
ఇవీ చదవండి: