Farmers Removing Chilli Crops in Hanumakonda District: హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా పత్తి, మిరప ,పసుపు ,వరి పంటలను ఎక్కువ స్థాయిలో సాగు చేస్తూ ఉంటారు. ఈసారి పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మిర్చి పండిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. పత్తి పంట కంటే మిర్చి పంటకు పెట్టుబడి ఎక్కువ. అయినా రైతులు సాహసం చేసి మిర్చి పంటను సాగు చేస్తున్నారు.
Farmers Removing Chilli Crops: గత సంవత్సరం వడగళ్ల వానతో చేతికొచ్చిన మిర్చి నేలరాలి ఆర్థికంగా దెబ్బతీసింది. అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేసినప్పటికీ, ధైర్యం చేసి మళ్లీ మిర్చి వేసి పెట్టుబడి పెట్టారు. పంట బాగా పండితే అప్పులు తీరి లాభాలు వస్తాయని ఆశిస్తే తెగుళ్లు, వైరస్‌లు రైతులను వెంటాడి వేధిస్తున్నాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
భూమి కౌలుకు తీసుకొని అప్పులు తీసి పెట్టుబడి పెడితే, తెగుళ్ల బారిన పడి పంటలు ఎండిపోతున్నాయని కనీసం కౌలు పైసలు వచ్చే పరిస్థితి లేదని దిగులు చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోగా పంట పూర్తిగా ఎండిపోవడంతో ఏం చేయాలో రైతులకు పాలు పోవడం లేదు. పూత ఖాతా దశలో తెగుళ్లు సోకి పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో మిర్చి పంటకు ధర ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి వచ్చినట్లయితే లాభాలు వచ్చేవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు పాలైన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: