షాపుల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని , దళారుల వ్యవస్థ లేకుండా చూడాలని.. ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని బాల సముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల పక్కన, ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్న వారిలో.. చాలామంది పేదవారే ఉన్నారని.. వీలైనంత వరకు వారికి లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాజీపేట , సిద్దార్థ్ నగర్, ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో కొత్త వెండింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలు ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల యజమానులు రోడ్డును సగం వరకు ఆక్రమించి తమ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వీధి వ్యాపారులు పోలీస్, మున్సిపల్ అధికారులకు సహకరించాలని నగర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. నగర రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీధి వ్యాపారుల హక్కులను కాపాడుతూ గౌరవప్రదంగా జీవించేందుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ భద్రు నాయక్ , మెప్మా అధికారులు పాల్గొన్నారు.