వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనలకు బాధ్యులనే నెపంతో 38 మంది భాజపా నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.
పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి.. రామ జన్మభూమి ట్రస్టు కార్యక్రమాలపై చేసిన ప్రకటనకు నిరసనగా జరిగిన ఘటనలో భాజపా నేతలను అరెస్టు చేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భావించాల్సి వస్తుందన్నారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. భాజపా కార్యకర్తలపై దాడి చేయడం, తరువాత పోలీస్ ష్టేషన్లో తమ పార్టీ నేతల కార్లను ధ్వంసం చేయడం.. పోలీసుల సమక్షంలో జరగడం ఒక దుర్మార్గమైన చర్య అన్నారు.
రాత్రి వేళ భాజపా నేత డాక్టర్ విజయచంద్రారెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్‌ను జేసీబీలతో కూలగొట్టించడం రాజకీయ పిరికి పందల లక్షణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ఘటన వెనుక కేసీఆర్, కేటీఆర్‌ల సూచనల మేరకే జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. మంత్రిగా ఉండి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా పోలీసులు.. శాంతి భద్రతలను రక్షించాల్సింది పోయి తెరాస నేతల ఆదేశాలను పాటించడం.. పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ అన్నారు.
ఇవీచూడండి: దాడులతో ఉద్రిక్తంగా మారిన వరంగల్