రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగ రేటు పెరిగిపోతోన్నా.. తెరాస ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ వరంగల్, ఖమ్మం, నల్గొండ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో.. ఆయన పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రేమేందర్ ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని వ్యాఖ్యానించారు.
ఇంటికో ఉద్యోగమని చెప్పి.. తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ప్రేమేందర్ ఎద్దేవా చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజాపాకు ఓటేసి, తెరాసకు బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: భాజపాకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు: మంత్రి ఎర్రబెల్లి