ఓ వైపు ఇంటిపని.. మరోవైపు భర్త, పిల్లల పనితో క్షణం తీరిక లేకుండా ఉంటుంది.. అయినా సమయం చేసుకుని ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన వస్తువులు తయారు చేస్తోంది వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండకు చెందిన ఆల్వాల వినీల. ప్రధానంగా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వస్తువులతో చూడచక్కని గృహ అలంకరణ వస్తువులు చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు.
ఆకర్షించే రీతిలో..
వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను కత్తిరించి నారను అందంగా చుట్టి పూల బొకేలు రూపొందిస్తున్నారు. ఇంకా హ్యాంగింగ్, టెబుల్ లైట్లు, పెన్ స్టాండ్ ఇతర వస్తువులను ఆకర్షించే రీతిలో తయారు చేస్తున్నారు. కుందన్, లేస్, సాయంతో వాటికో చక్కని రూపు తీసుకొస్తున్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ విఘాతం లేకుండా తనవంతుగా ఇంట్లోకి సామగ్రి తయారు చేస్తున్నానని వినీల చెబుతున్నారు.
పదిమందికి నేర్పాలన్న కోరిక
స్నేహితులు, సన్నిహుతులు ఇచ్చిన పెళ్లికార్డులను పారేయకుండా వాటిని అందమైన ఫోటో ఫ్రేములుగా మలుస్తున్నారు. వాటి చుట్టూ పూలతో ఆకర్షణీయంగా తయారు చేస్తూ తిరిగి వారికే కానుకగా ఇస్తూ ప్రశంసలూ పొందుతున్నారు. మట్టితో కూడా ఆకట్టుకునే రీతిలో చిన్నపాటి బొమ్మలు తయారుచేసి తన ప్రతిభను చాటుకుంటున్నారు వినీల. వ్యర్థ పదార్థాలతో ఉపయోగపడే వస్తువులు తయారు చేయడమే కాకుండా... త్వరలో పదిమందికి నేర్పాలన్నది తన కోరికని వినీల చెబుతున్నారు. మొక్కల పెంపకంపై కూడా ఎంతో మక్కువ కలిగిన వినీల తన ఇంటిని వివిధ రకాల మొక్కలతో నందనవనంగా మార్చేశారు.
ఇదీ చూడండి : చెత్త తీస్తుండగా.. బావిలో పడ్డ ట్రాక్టర్!