ఖమ్మం జిల్లా కార్మిక శాఖ సహాయ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య చేసిన హంతకుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ మల్లారెడ్డి ప్రకటించారు. వారిని ఈ సాయంత్రం హన్మకొండ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని మల్లారెడ్డి వెల్లడించారు. నిందితులు శివరామకృష్ణ, మధుకర్, శంకర్లను అరెస్ట్ చేశామన్నారు. ఏ1, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న ప్రదీప్ రెడ్డి, రమేష్, విక్రమ్ రెడ్డిలు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.
చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి.. కత్తితో పొడిచి..
ఆనంద్‌రెడ్డి, ప్రదీప్ రెడ్డి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగిందని అన్నారు. ఈనెల 8న ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్ రెడ్డి తమకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. అప్పట్నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించామని తెలిపారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రదీప్ రెడ్డి అనుచరుడు శివరామకృష్ణను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆనంద్‌రెడ్డి హత్య గురించి, చంపేసిన ప్రదేశాన్ని చూపించాడని తెలిపారు. పథకం ప్రకారం ప్రదీప్ రెడ్డి, అతని అనుచరులు ఆనంద్‌రెడ్డిని హన్మకొండ నుంచి భూపాలపల్లికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి కత్తితో పొడిచి దారుణంగా చంపారని డీసీపీ వెల్లడించారు. నిందితులు ఉపయోగించిన వాహనంతోపాటు కత్తులనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఏడాదిన్నర క్రితమే ఇద్దరి మధ్య పరిచయం
ఏడాదిన్నర క్రితం భూ వివాదం పరిష్కారం చేసే క్రమంలో ఆనంద్‌రెడ్డి, ప్రదీప్ రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులుగా మారారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆనంద్‌రెడ్డి మృతదేహనికి వరంగల్ ఎంజీఎంలో పోస్ట్‌మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చూడండి : 'అలా చేస్తే సీఎం కేసీఆర్ ఇరుకున్నట్లే'