Sanskriti Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని.. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా జాతీయ సంస్కృతి మహోత్సవానికి హనుమకొండ ముస్తాబైంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చారిత్రక నగరి వైభవాన్ని తెలియచేసేలా.. సుందరంగా వేదికలను నిర్మించారు. ఉత్సవాలకు నగర ప్రజలకు ఆహ్వానం పలుకుతూ జరిగిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. వేయిస్తంభాల గుడి నుంచి...అదాలత్ వరకు నిర్వహించిన ఈ యాత్రలో...కళాకారులు బతుకమ్మ పాటలు, ఆటలు, కోలాటాలు నృత్యాలతో సందడి చేశారు.
2015 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తుండగా... తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, రాజమహేంద్రవరంతో పాటు..చారిత్రక ఓరుగల్లులోనూ తొలిసారిగా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, ఇతర అంశాలు తెలుపుతూ.. 80కి పైగా స్టాళ్లను సిద్ధం చేశారు. వివిధ రాష్ట్రాల కళాకారులు... తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు.
బుధవారం జరిగే ముగింపు వేడుకలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రదర్శనలు ఉచితమని... నగరవాసులంతా సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదీచూడండి: యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం..