వైద్యో నారాయణ హరి అంటారు. అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. వరంగల్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి రెహమత్బేగం లక్షద్వీప్‌కు చెందినవారు. రవాణా సదుపాయం లేని ఆ ప్రాంతంలో ఎంతో మంది బాలింతల ప్రాణాలు కాపాడారు. ఆవిడ సేవలను గుర్తించిన కేంద్రం 1999లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ వచ్చిన ఆమెను మంత్రులు, ఇతర వైద్యులు ఘనంగా సన్మానించారు.
గణనీయ కృషి...
లక్షద్వీప్ ఆగాటి అనే చిన్న దీవిలో జన్మించిన రెహమత్ బేగం... విద్యాభ్యాసం కష్టాల్లో సాగింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి వైద్యవిద్యను పూర్తి చేశారు. కేరళలోని కాలికట్లో ప్రీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె 1963లో వరంగల్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. గైనకాలజీలో పీజీ పూర్తి చేశాక తిరిగి స్వగ్రామం వెళ్లి అక్కడ దీవి ప్రాంతంలో వైద్య సేవలందించారు. విద్యుత్, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో గర్భిణులు అధికంగా చనిపోయేవారు. రెహమత్ బేగం వారికి అండగా నిలిచారు. టార్చిలైటు సాయంతోనే అనేక మందికి పురుడు పోసి... ప్రాణాలు నిలబెట్టారు. బాలింతల మరణాలు తగ్గించడంలో కృషి చేసినందుకు ఆమెను 1999లో పద్మశ్రీ వరించింది.
ఆత్మీయ పలకరింపు
వరంగల్ వచ్చిన ఆమెను వైద్యులు, సన్నిహితులు అభినందించారు. మంత్రులు ఘనంగా సన్మానించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ఆనందంగా ఉంది...
చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని రెహమత్ బేగం అన్నారు. తనకు జరిగిన సత్కారం, సన్నిహితుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు.
ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం