అందరమ్మాయిల్లాగే ఆమె తన జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. డాక్టరు కావాలన్న కోరికతో శ్రద్ధగా చదివారు. పీజీ వరకు ఆటంకాలు లేకుండా చక్కటి మార్కులతో దూసుకెళ్లారు. తర్వాత పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు. భర్త అనారోగ్యంతో ఆమె కథ అడ్డం తిరిగింది. ఏ ఉద్యోగమూ లభించక... చివరకు పారిశుద్ధ్య కార్మికురాలి(Msc student as sweeper)గా పనిచేస్తూ... ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషిస్తున్నారు.
వరంగల్ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబం... దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలే... వారికి ఇద్దరు కుమార్తెలు... పెద్ద కుమార్తె రజని బాగా చదివేవారు. పదో తరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. వైద్యవిద్య చదివేందుకు బైపీసీతో ఇంటర్‌లో చేరారు. 87 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యాయి. రెండో ఏడాది రసాయన శాస్త్రంలో 60కి 60 మార్కులొస్తే... అధ్యాపకులు ఇంటికొచ్చి అభినందించారు. కానీ ఎంసెట్‌లో మెడిసిన్ సీటు రాలేదు. బీఎస్సీలో చేరి ప్రథమశ్రేణి సాధించారు. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐచ్ఛికాంశంగా ఎమ్మెస్సీ చదివి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. 2013లో పీజీ పూర్తయ్యాక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత సాధించారు. అదే సమయంలో తల్లితండ్రులు ఆమెకు వివాహం చేయడంతో న్యాయవాది అయిన భర్తతో హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం సాఫీగానే గడిచింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబాన్ని చూసుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తూ రజని ఉద్యోగం కోసం ప్రయత్నించారు.
అంతలోనే మరో కుదుపు. నిండా 30 ఏళ్లు లేని భర్తకు గుండె జబ్బు బయటపడింది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారు. ఏకంగా మూడుసార్లు స్టెంట్లు వేయాల్సి వచ్చింది. ఈ కారణంగా ఆయనకు ఉపాధి దూరమైంది. కుటుంబ పోషణ భారం రజనిపైనే పడింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే... ఆమె ఉద్యోగాన్వేషణ చేశారు. భుక్తి కోసం సంతల్లో కూరగాయల వ్యాపారం చేశారు. అది కూడా కలిసి రాక... గత్యంతరం లేక... జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలి(Msc student as sweeper)గా చేరారు. రూ. పది వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇలాంటి పారిశుద్ధ్య కార్మికులెందరో తక్కువ వేతనాలకు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారని వారి వెతలపై అధ్యయనం చేస్తున్న ‘హక్కు’ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పారిశుద్ధ్య యోధుల(Msc student as sweeper)కు ప్రజలు, ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
అర్హతకు తగిన ఉద్యోగమిస్తే చాలు
"ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. ఈ మధ్య కరోనా, లాక్‌డౌన్‌తో వ్యాపారాలు సరిగా లేక సూపర్‌బజార్లు, మాల్స్‌లోనూ కొలువు దొరకలేదు. కుటుంబసభ్యులు, తెలిసినవారు వద్దంటున్నా... విధి లేక ఆరు నెలల కిందట పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరాను. మొదటిరోజు పని చేస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజూ విధులకు వచ్చి వెళ్లడానికే రూ.80 ఖర్చవుతోంది. పెద్దపాప మూడో తరగతి చదువుతోంది. చిన్నపాపను స్కూల్లో చేర్చాలి. మా వారు ఇంటివద్ద చిన్నపాటి దుకాణం నడుపుతూ, కుటుంబానికి తోడవుతున్నారు. వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే అయిదుగురం బతకాలి. నా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తే చాలనుకుంటున్నా. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా."
- రజని