వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రతిపాదించారు. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో ఉండే హన్మకొండ జిల్లాలో 12 మండలాలు ఉంటాయి. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉంటాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు నెలరోజులు గడువు ఇచ్చింది. నెల రోజుల్లోపు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కలెక్టర్లకు అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగున్నరేళ్ల డిమాండ్
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలనగానే రెండు జిల్లాల ప్రజలూ తరచూ గందరగోళానికి గురయ్యారు. ఏది ఏమిటో తెలియక ఇక్కట్లు పడ్డారు. చదువుకోనివారే కాదు.. చదువుకున్నవాళ్లూ పలు సందర్భాల్లో ఇబ్బందులు పడ్డారు. దీంతో పేర్లను మార్చాలన్న డిమాండ్ గత నాలుగున్నరేళ్ల నుంచీ ఉంది. హన్మకొండ పేరు ప్రాచుర్యం లేదన్న భావన అందరిలో ఉంది. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత నెల 21న వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి దీనికి సంబంధించి తన నిర్ణయాన్ని ప్రకటించారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి
పేర్ల మార్పుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడడంపై పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సౌకర్యార్ధం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
హన్మకొండ జిల్లాలోని మండలాలు
- హన్మకొండ
- ఖాజీపేట
- ఐనవోలు
- హసన్ పర్తి
- వేలేరు
- ధర్మసాగర్
- ఎల్కతుర్తి
- భీమదేవరపల్లి
- కమలాపూర్
- పరకాల
- నడికుడ
- దామెర
వరంగల్ జిల్లాలోని మండలాలు
- వరంగల్
- ఖిలా వరంగల్
- గీసుకొండ
- ఆత్మకూర్
- శాయంపేట
- వర్ధన్నపేట
- రాయపర్తి
- పర్వతగిరి
- సంగెం
- నర్సంపేట
- చెన్నరావుపేట
- నల్లబెల్లి
- దుగ్గొండి
- ఖానాపూర్
- నెక్కొండ
ఇదీ చదవండి: KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజల పట్టం'