రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై వరంగల్ గ్రామీణ జిల్లా పాలనాధికారి హరిత మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా పనుల్లో పురోగతి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతువేదికలను తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.