హనుమకొండ జిల్లా కేంద్రంలో వర్షం జోరుగా కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో నగరం తడిసిముద్దవుతోంది. ఏకధాటిగా కురుస్తోన్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరకాలలోనూ వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి అడపా దడపా కురిసిన వర్షం.. మధ్యాహ్నానికి కుండపోతగా మారింది. రహదారులపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లుపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. వర్ధన్నపేటలో స్థానిక బస్టాండ్‌ను వరద నీరు ముంచెత్తింది. నర్సంపేటలో కురుస్తోన్న వర్షానికి పాకాల సరస్సు నిండుకుండలా మారింది.
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: rain alert : హైదరాబాద్... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి