వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రూ. 48 లక్షల విలువ చేసే నకిలీ (Fake Seeds) మిరప విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో పట్టణంలోని అఖిల నామ ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణంలో సోదాలు చేయగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని మిరప విత్తనాలు దొరికాయని నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ద్వారకా సీడ్స్ కంపెనీ చెందిన స్టార్ బిందు రకానికి ప్రభుత్వం నుంచి కాని వ్యవసాయ శాఖ నుంచి కాని ఎలాంటి అనుమతులు లేవని ఆయన తెలిపారు. ఈ దాడులలో 1,953 ప్యాకెట్లు దొరికాయని వాటి విలువ రూ. 48 లక్షల 82 వేలని ఆయన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాలు అమ్మడం నేరమన్నారు. అనుమతి లేని విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని చేసి నష్టపోవద్దని అన్నారు.
అనుమతి లేని నకిలీ విత్తనాలు (Fake Seeds) రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై పీడీ యాక్ట్ (Pd act) పెట్టడానికి సైతం వెనుకాడమని వ్యాపారులను హెచ్చరించారు. దొరికిన విత్తన ప్యాకెట్లను సీజ్ చేసి వ్యాపారిపై కేసు నమోదు చేశామని వ్యవసాయ అధికారి తెలిపారు.