SRSP Kakatiya Canal in Dilapidated Stage : పొలాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చించి కాల్వలు నిర్మిస్తున్నా... నాణ్యతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉండాల్సిన కాల్వలు... ఒకటి రెండేళ్లకే శిథిలమవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు నీరందించే... ప్రధాన కాల్వల్లో రాళ్లు తేలిపోతున్నాయి. ఓ వైపు నాణ్యతాలోపం, మరోవైపు మరమ్మతుల్లోనూ నిర్లక్ష్యధోరణితో ఎస్సారెస్పీ-కాకతీయ కెనాల్ నుంచి ఆశించిన స్థాయిలో పంటలకు నీరందని పరిస్థితి నెలకొంది.
పరిస్థితి మళ్లీ మొదటికి : ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు సూర్యాపేట జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీ-కాకతీయ కెనాల్‌కు ఎన్ని మరమ్మతులు చేపట్టినా పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. కోట్లు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నా నాణ్యత లోపం కారణంగా ఉపయోగం ఉండటం లేదు. పూర్తిస్థాయిలో ఎప్పుడు మరమ్మతులు చేస్తారోనని వేచి చూడాల్సి వస్తోంది. హనుమకొండలోని చింతగట్టు క్యాంపు నుంచి ఒక కిలోమీటరు మేర.. పలు చోట్ల తీవ్రంగా కెనాల్ ధ్వంసమైంది.
నాసిరకం పనులే కారణం : ఈ కాల్వ నుంచే సాగు నీటిని విడుదల చేయనున్నారు. ఎక్కడికక్కడ ధ్వంసం కావడంతో వీటి గుండా నీరు ప్రవహించక చివరి ఆయకట్ట రైతులకు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఈ తరహా పరిస్థితి అనేక సార్లు తలెత్తింది. కోట్లు వెచ్చించి సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ.... నాసిరకం పనుల కారణంగా కొద్ది రోజులకే కాలువలు ధ్వంసం అవుతున్నాయి. మరమ్మతుల విషయంలో జాప్యం చేస్తే సరైన సమయంలో పంటలకు నీరందక రైతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి... మరమ్మతులు త్వరితగతిన ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ
నిర్లక్ష్యానికి ప్రతీకే ఇది : ఎస్సారెస్పీ కాకతీయ కాలువ లైనింగ్ కొట్టుకుపోయి శిథిలావస్థకు చేరుకుందని గతంలో వార్తలొచ్చినప్పటికీ అధికారులు ఇంకా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో రేవల్లి నుంచి చొప్పదండి వరకూ నాలుగు కిలోమీటర్ల మేర కాలువకు అక్కడక్కడ సిమెంటు కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని అప్పట్లో అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మట్టి.. పట్టించుకోని అధికారులు : కరీంనగర్ జిల్లా రేవల్లిలో ఎస్సారెస్పీ కాలువ ఒకవైపు లైనింగ్ శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తే ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకు పోయి దిగువ ప్రాంతాలు జలమయంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచే కాకతీయ కాలువ నేరుగా దిగువ మానేరు జలాశయంలోకి కలుస్తోంది. వర్షాకాలానికి ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరినప్పటికీ అధికారులు ఇదివరకు చర్యలు తీసుకోలేదు.
ఇవీ చదవండి: