రాష్ట్రవ్యాప్తంగా 500 మంది జనాభా కలిగిన తండాలను, పల్లెలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. యువత తమ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది పోటీచేసి గెలుపొందారు. తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్ల అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది గ్రామ సర్పంచ్‌లు, చిన్నచిన్న గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, చెత్తడంపింగ్ యార్డులు, దహనవాటికలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా బిల్లులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 90వేలు...
జిల్లాలోని గీసుకొండ మండలం రాంపూర్‌లో రూ. 7 లక్షల విలువైన పనులు చేస్తే రూ. 90వేలు మాత్రమే బిల్లులు చెల్లించారని వాపోయారు. పనులు చేయడానికి అప్పులు తీసుకొచ్చి పెడితే వాటి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్పంచ్ తెలిపారు. పనులు చేయకపోతే మెమోలు ఇస్తామని, సస్పెండ్ చేస్తామని జిల్లా ఉన్నతాధికారుల నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు అందరు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులే మిగిలాయి...
గ్రామంలో అభివృద్ధి పనులు చేసి మంచిపేరు తెచ్చుకోవాలని ముందుకొస్తే తమకు అప్పులే మిగిలాయన్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి బిల్లులు చెల్లిస్తే కొంత తమకు సహకారం చేసిన వారవుతారని లేదంటే గ్రామాల అభివృద్ధి సంగతేమోగాని చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి