వరంగల్ నగరంలో మద్యం సేవించే వారి శాతం ఎక్కువే. డ్రంకెన్ డ్రైవ్‌ను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు రాత్రి వేళ ప్రధాన రోడ్లపై మకాం వేసి వాహనాలను ఆపి మద్యం తాగారా? లేదా? అని శ్వాస విశ్లేషణ యంత్రాలతో పరీక్షిస్తున్నారు. ద్విచక్ర వాహనం మొదలుకుని మూడు, నాలుగు టైర్ల వాహనాలను నిలిపివేసి డ్రైవర్లను యంత్రం ద్వారా పరీక్షిస్తున్నారు. వరుసగా కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్‌తో చోదకుల్లో వణుకు మొదలైంది.
పాయింట్ల ఆధారంగా శిక్ష: ఆల్కహాల్ శాతం 30 కంటే ఎక్కువ ఉంటే మద్యం తాగినట్లుగా నిర్ధరణకు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. మరుసటి రోజు స్టేషన్‌కు పిలిచి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఆల్కహాల్ శాతాన్ని బట్టి జడ్జి కొందరికి జరిమానా, మరికొందరికి జరిమానాతో పాటు మూడు, నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు.
ఆల్కహాల్ వంద పాయింట్ల కంటే ఎక్కువగా వస్తే జైలు శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తక్కువ వచ్చిన వారు భారీగా జరిమానా చెల్లించాలి. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 14,279 వరకు నమోదు కాగా.. రూ.1.72 కోట్ల వరకు జరిమానా విధించారు. 1964 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
తరచూ దొరికితే లైసెన్స్ రద్దు..: తాగి వాహనం నడుపుతూ తరచూ పోలీసులకు చిక్కితే లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. పట్టుబడిన వ్యక్తికి పోలీసులు ట్రాఫిక్ శిక్షణ సంస్థలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. కోర్టులో హాజరుపరుస్తారు. న్యాయమూర్తి జరిమానా లేదా జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఎక్కువగా యువత: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో యువతే దొరుకుతోంది. ఎక్కువగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య వారిని పోలీసులు గుర్తించారు. వీరు తనిఖీల సమయంలో పోలీసులపై తిరగబడిన సందర్భాలున్నాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసులో శిక్ష పడిన తర్వాత మాత్రమే వాహనాన్ని తిరిగి అప్పగిస్తారు.
"మద్యం తాగి వాహనాన్ని నడిపితే చట్ట ప్రకారం నేరం. పట్టుబడితే రెండు రోజుల నుంచి నెల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపకూడదు. ఈ సందర్భంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది."-ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్
ఇవీ చదవండి: