చుట్టూ కొండలు. మధ్యలో అందమైన చెరువు. అందులో నిండా నీరు. పక్షుల కిలకిలా రావాలు తప్ప మరో శబ్దం వినిపించని ఆ ప్రకృతి ఒడిలో ఎంత సేపున్నా తనివి తీరదు. ఆ సుందర దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. అయితే రెండు నెలల వరకు ఇక్కడసలు చెరువే ఉండేది కాదు. ప్రకృతి ప్రేమికుడు ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పక్షులను కాపాడ్డానికి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకే దీన్ని నిర్మించారు. చెరువులు కన్పిస్తేచాలు కబ్జా చేసే వారున్న కాలంలో పక్షుల కోసం భూమిని కొని చెరువులు తవ్విస్తూ.. ప్రకృతి గురించీ ఆలోచించమనే స్ఫూర్తి నింపారు.
పక్షుల సంఖ్య తగ్గిపోతే... జీవవైవిధ్యం దెబ్బతింటుంది. తద్వార మానవ మనుగడ కష్టమవుతుంది. పక్షుల సంఖ్య తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి పంటకోసం విపరీతంగా వాడుతున్న రసాయన ఎరువులైతే, మరో కారణం పక్షుల ఆవాసమైన చెట్ల నరికివేత. ఒకప్పుడు పేదవారి ఇంటి ముందు కూడా పక్షుల ఆహారం కోసం వరి గొలుసులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? మనకు ఎన్నో వనరులను ఇస్తున్న ప్రకృతిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు అంధకారమే.
అమ్మమాట కోసం...
‘సంపాదించడం గొప్ప విషయం కాదు... దాన్ని మంచి పనుల కోసం వినియోగించినప్పుడే సార్థకత...’ అని అమ్మ సుశీలమ్మ చెప్పిన మాటనే తన బాటగా చేసుకున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు. ఆర్‌ఈసీˆలో 1974లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారీయన. వ్యాపారంలోకి అడుగుపెట్టి బాగా స్థిరపడ్డారు. తాతల నుంచి వచ్చిన ఆస్తులూ తన సంపాదనకు తోడయ్యాయి. ఎంత సంపాదించినా లోలోపల సమాజానికి ఏదో చేయాలన్న తపన వెంటాడేది. స్వగ్రామంలో పాఠశాలను, ఆర్చరీ స్కూల్‌ను మొదలుపెట్టారు. ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు ఆర్చరీలో శిక్షణ పొంది ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. రామ్మోహన్‌రావు వాళ్లమ్మ సుశీలమ్మ సమాజానికి మేలు చేయమని చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు. అనేక సేవ కార్యక్రమాలు తలపెట్టారు. ప్రకృతిని కాపాడాలనే ఆలోచనతో 25 ఏళ్ల క్రితం పక్షుల సంరక్షణకు నడుంకట్టారు.
పక్షుల కోసం చెరువులు
మొదట హైదరాబాద్ నుంచి కొన్ని ఊర పిచ్చుకలను తెచ్చి తమ ఇంటి ఆవరణలో పెంచారు. పక్షులకు ఆవాసమైన మర్రి, మేడి, బాదాం, మల్బరీ, పొగడ, పూల చెట్లను విరివిగా పెంచారు. భూగర్భ జలాలనూ పెంపొందించాలనే ఆలోచనతో తన ఇంటి వద్దే పావు ఎకరం స్థలంలో కుంటను తవ్వించారు. అది నిండడంతో చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరిగాయి. కొన్ని పొలాలకు కూడా నీళ్లు అందుతున్నాయి. ఆ తర్వాత మరో 9 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ కూడా భారీ చెరువును నిర్మించారు. ఆ స్థలాన్ని మొత్తం గుడికి విరాళంగా ఇచ్చారు. తర్వాత తన వ్యవసాయ క్షేత్రంలో మరో తటాకాన్ని నిర్మించి ఆ ప్రాంతంలో చిట్టడవిని తలపించేలా 7 వేల మొక్కలను పెంచి ఎన్నో రకాల పక్షులను సహజంగా సంరక్షిస్తున్నారు. పక్షుల కూతలతో సమాజానికి మేలుకొలుపు పాడుతున్నారు.
ఏడెకరాలు కొని..
ఇప్పటికే మూడు చెరువులను నిర్మించినా రామ్మోహన్‌రావు సంతృప్తి చెందలేదు. ఈ మధ్యే కల్లెడ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో ఏడెకరాల స్థలం కొనుగోలుచేసి చెరువును తవ్వించారు. ఈ మధ్య కురిసిన వానలకు చెరువు నిండింది. ఈ ప్రాంతంలో నివసించే ఎన్నో రకాల పక్షులతోపాటు, అడవి పందులు, నక్కలు, కుందేళ్లను కాపాడ్డానికే తన సొంత ఖర్చులతో ఈ చెరువు నిర్మించారు. ఈ ప్రాంతంలో ఎవరూ పక్షులను, జంతువులను వేటాడకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చెరువులో చేపలను పెంచుతున్నారు. తద్వారా ఆహారం కోసం వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతోంది. తాబేళ్లను కూడా చెరువులో వేశారు. ఈ చెరువుకు తన మనవరాలి పేరు గుమ్ములు అని నామకరణం చేశారు. ఎవరైనా గూళ్లు కట్టొచ్చు, చెరువులు నిర్మించవచ్చు, అడవులు పెంచొచ్చు... ఓ వాతావరణాన్నే సృష్టించాలంటే ఎంతో తపన, దానికి మించి శ్రమ అవసరం. అవన్నీ ఆయనలో ఉన్నాయని నిరూపించారు.
ఇంటి వద్ద, పాఠశాలలో, వ్యవసాయ క్షేత్రంలో పక్షుల ఆవాసానికి కృత్రిమంగా అనేక పిట్ట గూళ్లను వెదురు కర్రలతో తయారుచేసి పెట్టారు. ఈ పాఠశాలో అడుగుపెడితే ఊరపిచ్చుకల నుంచి మొదలుపెడితే ఎన్నో జాతుల పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతాయి.
ఇదీ చదవండి: తల్లికి అంత్యక్రియలు జరిపి ఐదుగురు కుమారులు మృతి