TS Highcourt on Tenth Question Paper Issue : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఎస్సీ హిందీ ప్రశ్నపత్రం వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన పదో తరగతి విద్యార్థి హరీశ్‌కు ఊరట లభించింది. వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే ఈ వ్యవహారంలో పదో తరగతి విద్యార్థి హరీశ్ వద్ద నుంచి హిందీ ప్రశ్న పత్రం బయటకు వచ్చినట్టు తేలడంతో చీఫ్ సూపరింటెండెంట్ అతడిని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు.
తాను ఏ తప్పూ చేయలేదని.. ఐదేళ్ల పాటు తనను ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి హరీశ్ బోరున విలపించాడు. అలాగే గురువారం హరీశ్ కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు. అప్పుడు హనుమకొండ డీఈవో అతన్ని పిలిచి నీ క్వశ్చన్ పేపర్ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారంటూ బాధిత విద్యార్థిని మందలించారు. పరీక్ష రాయవద్దంటూ అతన్ని బయటకు పంపారు. హాల్ టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని.. బయటకు వచ్చిన అనంతరం ఆ విద్యార్థి బోరున ఏడ్చాడు.
కుమారుడి దుఃఖాన్ని భరించలేకపోయిన హరీశ్ తండ్రి.. విద్యాశాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గోడ దూకి కమలాపూర్ పరీక్షా కేంద్రంలోకి వచ్చిన శివ కృష్ణ.. పరీక్ష రాస్తున్న హరీశ్‌ను భయపెట్టి హిందీ ప్రశ్నపత్రం తీసుకున్నాడని బాధిత విద్యార్థి తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే అతని ప్రశ్నపత్రం తీసుకుని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడని, అదే ప్రశ్న పత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని ఆయన వివరించాడు.
తన కుమారుడిని బెదిరిస్తే భయపడి ప్రశ్నపత్రం ఇచ్చాడే తప్పా.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పిటిషన్‌లో హరీశ్ తండ్రి వివరించారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న తన పుత్రుడిని పరీక్షలు రాసేందుకు అనుమతించి, అతని భవిష్యత్తును కాపాడాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం.. బాధిత విద్యార్థి హరీశ్ సోమవారం నుంచి మిగిలిన పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని విద్యాశాఖను ఆదేశించింది.
రెండు వారాల తర్వాత మళ్లీ కేసు విచారణ : ప్రభుత్వం పదో తరగతి హిందీ పేపర్ లీక్ విషయంలో తాము బయట ఉంటే అక్రమాలు వెలుగులోకి వస్తాయని.. అందుకే జైల్లో వేశారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. హిందీ పేపర్ లీక్ జరిగినప్పుడు హరీశ్ అనే విద్యార్థిని డిబార్ చేసి బలి చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. వరంగల్ కమిషనర్ రంగనాథ్ ఆ విద్యార్థికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా డిబార్ చేశారని విమర్శించారు. ఈ విషయంపై తాము కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో హరీశ్‌కు ఉపశమనం కలిగిస్తూ ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రెండు వారాల తర్వాత మళ్లీ ఈ కేసు విచారణ జరుగుతుందని.. అప్పుడు మిగతా రెండు పరీక్షలు కూడా సప్లిమెంటరీలో రాసేలా వీలు కలుగుతుందని బల్మూరి వెంకట్ తెలిపారు.
ఇవీ చదవండి: