రాఖీ పండుగకు ప్రకృతి ప్రసాందించిన రాఖీలు సిద్ధమయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం పెరుకవేడులో శివాలంయంలో నాటిన మెుక్క రాఖీ పూలను పూయించి ఈ వేడుకలో తానూ భాగమైపోవాలనుకుంటోంది. అమ్మ మనసులోని ఆప్యాయతను... నాన్న చేతిలోని బాధ్యతను కలిపి చూపించేవాళ్లే తోబుట్టువులు. తమ వాళ్లకు అండగా మేమున్నామనే భరోసాకు సాక్ష్యంగా నిలిచేదే రాఖీ పండుగ.
ఎవరి అభిరుచికి తగ్గట్టు...
అభిరుచులకు తగ్గట్టుగానే అనేక రకాల రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. పెద్దోళ్లు మెరిసిపోతున్న రాఖీలు ఇష్టపడతారు. చిన్నారులు బొమ్మలున్న రాఖీలవైపు మొగ్గుచూపుతారు. యువత ఫ్యాన్సీ రాఖీల కోసం పోటీ పడతారు. కొందరైతే బంగారం, వెండి, వజ్రం ఇలా ఎవరి ఇష్టం వారిది. వీటన్నింటికీ భిన్నంగా ప్రకృతి ప్రసాదించిన రాఖీలు కట్టుకుంటే ఆ అనుభూతే వేరు. మార్కెట్లో వివిధ రకాల రాఖీలు దొరికినా.... వీటి ప్రత్యేకత దేనికీ రాదు. ఈ పుష్పాలను కౌరవ, పాండవ పువ్వులు అని పిలుస్తారు. రాఖీ ఆకారంలో ఉండే ఈ పూలను కృష్ణ కమలం అని స్థానికులు పిలుస్తారు. పుష్పం మధ్యభాగంలో ఉండే మూడు రేకులు త్రిమూర్తులకు ప్రతిరూపాలుగా భావిస్తారు. అందుకే వీటిని ఎక్కువగా దేవాలయాల్లో నాటుతారు.
తన తీగలతో అల్లుకుపోతూ... చెట్టు కొమ్మల్ని పెనవేసుకుపోయి మమతాను బంధాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది ఈ మొక్క. అందుకేనేమో దీనికి మానవ బంధాలపై అమితప్రేమ. తాను కూడా రాఖీ శుభాకాంక్షలు చెప్పాలని పూలు పూయించి ఆకర్షిస్తోంది. వాటి నుంచి వచ్చే సువాసనలతో మనసుకు ఆహ్లాదాన్నిపంచుతోంది.
ఇదీ చూడండి: విద్యుత్ కాంతుల్లో సరికొత్తగా పార్లమెంట్