Anantalakshmi Govt Ayurveda College: వరంగల్‌లోని అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అధ్యాపకుల కొరత, మౌళిక వసతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 2023 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది ప్రవేశాలను రద్దు చేస్తూ.. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసన్ నిర్ణయం తీసుకోవడం విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపు విషయంలో 2014లోనే ఎన్ఐసీఎస్ఎం అభ్యంతరం తెలిపింది.
తీరు మార్చుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇస్తూ 8 ఏళ్ల నుంచి అనుమతులు తీసుకుంటూనే ఉంది. ఎంతకీ తీరు మారకపోవడంతో ఈ కళాశాలపై వేటు తప్పలేదు. ఈ ఏడాది అడ్మిషన్లు రద్దు చేయడంపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కళాశాలకు ప్రవేశాలను రద్దు చేయడం వల్ల 63 మంది విద్యార్థులు బీఏఎమ్ఎస్ కోర్సులో చేరే అవకాశాన్ని కోల్పోయారు. కనీసం ఈ కళాశాలకు బస్సు సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడి వసతి గృహంలో నీటి సౌకర్యం, సరైన బాత్‌రూంలు లేవని వాపోతున్నారు. కళాశాలలో సరిపడా అధ్యాపకులు లేరని.. కనీసం ల్యాబ్‌లో ఉండాల్సిన పరికరాలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై సమీక్ష నిర్వహించి త్వరలోనే వారి సమస్యలు నెరవేరుస్తామని అధికారులు చెబతున్నారు. అధికారులు ఇప్పటికి ఎన్నోసార్లు హామీలు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.
"మా కాలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసేశారు. దానితో మేము గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న తాళం వేయడంతో మా సార్ వచ్చి మాతో చర్చలు జరిపారు".- విద్యార్థి, అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల
"మేము ప్రభుత్వం వసతి గృహంలో ఉంటున్నాం.. కనీసం హాస్టల్లో బాత్ రూంకి డోర్లు కూడా లేవు.. సరైన గేట్లు లేవు.. అక్కడికి రోజు బయట వ్యక్తులు వచ్చి రాత్రి పూట మద్యం సేవిస్తారు. మాకు చాలా భయంగా ఉంటోంది. మా కాలేజ్లో కూడా ఎటువంటి వసతులు లేవు.. ల్యాబ్‌లో కనీసం పరికరాలు లేవు. సరిపడా అధ్యాపకులు లేరు".- విద్యార్థి
"విద్యార్థుల సమస్యలు విన్నాం.. వాటి అన్నింటిని మేము నోట్ చేసుకున్నాం.. కచ్చితంగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా తర్వలోనే అన్ని చర్యలు తీసుకుంటున్నాం.".-ఆయుర్వేద కళాశాల కార్యనిర్వాహక అధికారి
ఇవీ చదవండి: