వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లి, కోగిల్వాయి గ్రామాల శివారులో ఉన్న మిషన్ భగీరథ నీటి సరఫరా కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. నీటి సరఫరా కేంద్రంలోని అన్ని విభాగాల్లో పర్యటించి నీటి శుద్ధీకరణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం కాలినడకన చంద్రగిరిగుట్ట ఎక్కి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకొని దేవాలయాన్ని, అక్కడ ఉన్న కోనేరును పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చంద్రగిరిగుట్టలో కొలువైన శ్రీ చెన్నకేషవ స్వామి సన్నిధిలో నిర్మించిన ఈ మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ, సరఫరా కేంద్రం ఒక అద్భుతమని ఆయన అన్నారు. గుట్టపైన వాటర్ ట్యాంక్ వరకు ఉన్న రోడ్డును శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం వరకు వేయాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అపరభగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కేంద్రం నుంచి పరకాల నియోజకవర్గంలో 163 ఆవాసాలకు, పరకాల మున్సిపాలిటీకి శుద్ధజలాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రగిరిగుట్టల్లో కొలువున్న శ్రీ చెన్నకేషవ స్వామి విశిష్టతను, ఈ ప్రాంత ప్రత్యేకతను సీఎం కేసీఆర్‌కు వివరించి వారి సహకారంతో దేవాలయాన్ని, ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, రెడ్‌క్రాస్ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్