అది వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపూరంలోని అటవీ ప్రాంతం. చుట్టూ గుట్టలను కలుపుతూ కాకతీయులు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పాకాల సరస్సును నిర్మించారు. సహజసిద్ధంగా ఉన్న ప్రకృతి అందాలకు తోడు అటవీశాఖ, పర్యటకశాఖలు మరిన్ని సొగసులు అద్దడంతో ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాదు వివిధ రాష్ట్రాల్లోని ప్రకృతి ఆరాధకులు, పర్యటక ప్రియులు ఈ నిండుకుండాలాంటి సరస్సును, ప్రకృతి సోయగాలు చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ సరస్సుకు ఇంకో ప్రత్యేకత ఉందండోయ్... కాలుష్య రహిత సరస్సుల్లో ప్రపంచంలోనే ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. భారతదేశంలో రెండో స్థానంలో ఉంది.
ఇక్కడ ప్రకృతి అందాలే కాదు... సరస్సు తూముపై ఏర్పాటు చేసిన లంగరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పిల్లాపాపలతో వచ్చి ఆటలాడుతూ... సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకోసం అటవీశాఖ ప్రత్యేకంగా ఊయలలను ఏర్పాటు చేసింది. పర్యటకశాఖ ఏర్పాటు చేసిన బోటింగ్‌లో షికారు చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నామని ప్రకృతి ప్రేమికులు తెలుపుతున్నారు. అలసిపోయినా వారు సేదతీరేందుకు కాటేజీలను సైతం ఏర్పాటు చేశారు.
మరి ఇంకెందుకు ఆలస్యం. తదుపరి మీ విహారయాత్రను పాకాలకే పోనివ్వండి. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ ప్రదేశానికి మీరు ఓ కుటుంబంతో కలిసి వెళ్లి సేదతీరండి. కాలుష్యం నుంచి కాసేపైనా ఉపశమనం పొందండి.
ఇవీ చూడండి: చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం