రానున్న పురపాలక ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలనే ధోరణిలో అధికార పార్టీ ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
మున్సిపాలిటీలు అనేవి ప్రజలకోసం పని చేయాలని అధికార దాహంతో, డబ్బు, మద్యాన్ని ఎరచూపి గెలిస్తే పురపాలికలు అనేవి ప్రజల కోసం మిగలవన్నారు. అదే జరిగితే మున్సిపాలిటీలు కొంతమంది స్వార్థ పరుల చేతిలో జేబు సంస్థగా మారిపోతాయని హెచ్చరించారు. మున్సిపాలిటీల మీద ఆదాయాన్ని పిండుకునే పని తప్ప సేవ అనేది ఉండదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే మురుగునీటి వ్యవస్థ సరిగ్గా ఉండట్లేదని అన్నారు. అన్యాయమైన పాలనను రూపుమాపడానికి ప్రయత్నం చేద్దామని ప్రజలకు పిలుపినిచ్చారు. జనవరి 8న అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్కు తెజస సంపూర్ణ మద్దతిస్తుందని కోదండరాం స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నా: ఉత్తమ్