వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాలలో నూతనంగా నిర్మించిన 8 రైతు వేదికలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ ఛైర్మన్ సుధీర్ బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం వేలేరు మండలం షోడాశపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ రైతు సమ్మేళన కార్యక్రమంలో మంత్రులు ప్రసంగించారు. రైతుబంధు (Raithu bandu) ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని... ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పథకమని నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. రెండు రోజుల్లోనే రూ.1,669.42 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు.
ఈనెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రైతువేదికలను నిర్మించామన్నారు. ఈ వానకాలం, యాసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల్లో పంట పండిందని... మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు.
గతంలో కరెంటు సక్రమంగా ఉండకపోయేదని.. ఆ పరిస్థితి లేకుండా 24 గంటలు ఉచితంగా కరెంటు అందిస్తున్నమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని... తడిసిన ధాన్యం కూడా కొంటుందన్నారు.
ఇదీ చదవండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం