చేనేత కార్మికులు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య కోదండరాం తెలిపారు. వరంగల్ నగరంలోని కొత్తవాడలో ఆయన పర్యటించారు. చేనేత కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం కుదేలైందని కార్మికులు కోదండరాంకు వివరించారు.
చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కోదండరాం ఆరోపించారు. బతుకమ్మ లేని తెలంగాణను ఏవిధంగానైతే ఊహించుకోలేమో... చేనేత కార్మికులు లేని రాష్ట్రాన్ని కూడా ఊహించలేమన్నారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వం... చేనేత వృత్తిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.
ఈ రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేసిన కోదండరాం... చేతివృత్తులకు విదేశాలలో ప్రత్యేక గుర్తింపు, సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక వర్క్ షాపులు ఏర్పాటు చేయడంతో పాటు.. చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పాటు చేసి... ముమ్మరంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చూడండి: నిధులు విడుదల కాక ఇబ్బందుల్లో చేనేత కార్మికులు