Illegal Soil Excavations: వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ వెంటే మొరం దందా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కాలువను 1985లో తవ్వారు. గీసుకొండ, సంగెం మండలాల్లో కాలువ లోతు చాలా ఎక్కువగా ఉండడంతో.. ఇక్కడ భూసేకరణ భారీగా జరిగింది. తవ్విన మట్టిని కాలువకు ఇరువైపులా సేకరించిన భూమిలో వేయడంతో అవి గుట్టలను తలపించేలా నిల్వలు ఉన్నాయి. ప్రజోపయోగమైన పనులు చేపట్టేందుకు మట్టిని తీసుకెళ్లాలంటే మొదట ఎస్సారెస్పీ అధికారుల అనుమతితోపాటు... గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరి. దీన్నే అదనుగా చూసుకుని అక్రమార్కులు పేరుకు 100 ట్రిప్పుల అనుమతి పొంది.. వేల ట్రిప్పులు తరలిస్తూ.. కాలువ భవిష్యత్తును ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. మొరం తరలింపును స్థానికులు అడ్డుకునే యత్నం చేసినా... ఫలితం లేకుండాపోతోంది.
చర్యలేవి?
కాలువ వెంట ఉన్న మట్టిని తవ్వితే.. బలహీన పడి గండి పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న దందాపై.. ప్రశ్నించినా ఎవ్వరూ చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువకు ఇరువైపులా మొక్కలు నాటి... హద్దులు పెట్టుకొని కాపాడాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఒకటి రెండు చోట్ల మొక్కలు పెట్టినా వాటిని సంరక్షించకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఇదీ చూడండి: