వరంగల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం అలజడిని సృష్టించింది. రాత్రి సమయంలో ఉరుములు, గాలితో కూడిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పల్లపు ప్రాంతాలలోని రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరం మొత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉరుములతో కూడిన భారీ వర్షం
వరంగల్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాంపై రేకులు పట్టాలపై ఎగిరి పడడంతో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మసాగర్, వేలేరు మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడితోటలలో మామిడికాయలు రాలిపోయాయి. జనగామ జిల్లా నర్మెట్ట, లింగాల ఘణపురంలో వడగళ్ల వర్షం పడింది. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
వాతావరణం చల్లగా మారటంతో ఉపశమనం
ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు..ఒక్క సారిగా వర్షం కురవటంతో వాతావరణం చల్లగా మారింది. భానుడి భగభగల నుంచి కొంతైనా ఉపశమనం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.