Farmers loss in Warangalఆరుగాలం కష్టపడే రైతు తాను పండించిన పంటను చూసి మురిసిపోతాడు. గిట్టుబాటు ధర రాకున్నా వచ్చేఏడాదికి లాభాలు రాకపోతాయా అనే ఆశతో వ్యవసాయం చేస్తుంటాడు. కానీ చేతికొచ్చిన పంట కళ్ల ముందు వర్షార్పణమైతే మాత్రం తట్టుకోలేడు. ఈ నెల 11 నుంచి 15 వరకు కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను నష్టాల్లోకి నెట్టాయి. ఈనెల 11 న నర్సంపేట, పరకాల మండలాల్లో దాదాపు రెండు గంటలకు పైగా ఈదురుగాలులతో కురిసిన వర్షంతో భారీ వృక్షాలు నేలకూలాయి. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
Farmers loss in Warangal district: కంటికీ మింటికీ రోదిస్తున్న ఆమె పేరు బుచ్చమ్మ. హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తికి చెందిన ఆమె మూడెకరాల్లో 4 లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేసింది. గత వారంలో కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నీట మునగడంతో కన్నీటి పర్యంతమైతోంది. ఒక్క బుచ్చమ్మే కాదు మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలు వేసిన అన్నదాతలందరిదీ అదే పరిస్ధితి. చేతికి అందివచ్చిన పంటను వరుణదేవుడు తీసుకుపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కౌలు రైతులదీ ఇదే దీనస్ధితి. పంట పండించి కొద్దో గొప్పో వస్తే అప్పులు కడదామనుకుంటే అకాల వర్షం తమని నష్టపోయేలా చేసిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rains in Warangal: హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 33 మండలాల్లో 33 వేల 331 ఎకరాల్లో మిరప పంటకు నష్టం వాటల్లింది. 17 మండలాల్లో 11 వేల 190 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయారు. కూరగాయలు 348 ఎకరాలు, ఇతరపంటలు 510 ఎకరాలమేర నష్టం వాటిల్లింది. ఎక్కువగా నర్సంపేట నియోజకవర్గంలో 17 వేల 700 ఎకరాల్లో మిరప, 8 వేల ఎకరాల్లో మెుక్కజొన్న నీటిపాలయ్యాయి. పరకాల నియోజకవర్గంలో 6 మండలాల్లో దాదాపు పదివేల ఎకరాల్లో మిర్చి, ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు పరిశీలించనున్నారు.
ఇదీ చూడండి: