Son became a lawyer to get justice for his mother story: తల్లిదండ్రులు 30 ఏళ్ల క్రితం విడిపోయారు. అప్పుడు ఆ అబ్బాయికి లోక జ్ఞానం కూడా తెలువదు. ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సు.. కానీ ఆ కుమారుడు అప్పటి నుంచే తన తల్లి బాధను అర్థం చేసుకుని ఏలాగైనా ఆమెకు న్యాయం చేయాలనే లక్ష్యాన్ని తన మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఇంటర్ చదువుతున్న వయస్సులోనే ఆయన తన తల్లికి న్యాయం కోసం అనేకమార్లు ఆమెతో పాటు న్యాయస్థానం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం దక్కలేదు. అలాగని నిరాశకు గురై పోరాటం ఆపలేదు. చివరకు తన తల్లి కేసును స్వయంగా తానే వాదించి ఆమె మొహంలో చిరునవ్వులు నింపాడు. తన కుమారుడి విజయగాథ గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
'నా పేరు సులోచన. నాకు 1971లో పెళ్లి అయ్యింది. 1992లో విడిపోయాం. ముప్పై సంవత్సరాల నుంచి మధ్యలో కేసు పెట్టినా కూడా గెలవలేదు. ఇప్పుడు నా కుమారుడే స్వయంగా నా కేసు వాదించి గెలవడం సంతోషంగా ఉంది. పిల్లలను చదివించడానికి మా అమ్మవాళ్లు సహాయం చేశారు. ఎట్లైనా తండ్రి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్న కుమారుడి లక్ష్యం నెరవేరింది అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.'-సులోచన, లాయర్ తల్లి
ఒక ఐదు దశాబ్దాలు వెనక్కి వెళితే 1971లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన సులోచనకు అదే వరంగల్ నగరంలో నివాసం ఉంటున్న పాము సోమయ్యకు వివాహం జరిగింది. వీరికి శరత్‌బాబు, రాజా రవికిరణ్ ఇద్దరు కుమారులు కలరు. తరువాత భార్యభర్తలు మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ ఘర్షణ మొత్తాన్ని పెద్ద కుమారుడైన శరత్‌బాబు గమనిస్తూనే ఉండేవాడు. ఈ దంపతులు ఇద్దరు చివరకు 1992లో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే మేలు అని భావించి విడాకులు తీసుకున్నారు. సులోచన తన ఇద్దరి కుమారులతో తన పుట్టింటికి వెళ్లి, తన కుమారులను పెద్దవారిని చేసింది.
30 ఏళ్ల తర్వాత స్వయంగా న్యాయవాద వృత్తి చేపట్టిన ఆయన.. మొట్టమొదటగా తన తండ్రిపైనే కేసు వేశారు. ఆమెకు భరణం ఇప్పించడంలో విజయం సాధించారు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అప్పట్లోనే శరత్‌బాబు తల్లి వరంగల్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1997లో అనుకూలంగా డిక్రీ వచ్చింది. కానీ, వారికి న్యాయవాది సరైన సమాచారం ఇవ్వలేదు. తీర్పు ప్రతి కోసం పెద్దకుమారుడు శరత్‌బాబు అనేకమార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తల్లికి న్యాయం జరగాలంటే తానే లాయర్ కావాలని శరత్ గట్టిగా అనుకున్నారు.
మొదట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ ఉద్యోగం చేశారు. 2019లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2021 ఆగస్టులో పాత డిక్రీ ప్రతిని సంపాదించి.. దాని ఆధారంగా తండ్రి నుంచి తల్లికి భరణం ఇప్పించాలంటూ కేసు వేశారు. ఈ వివాదం లోక్‌అదాలత్ ద్వారా పరిష్కారమైంది. సులోచన(62)కు ఆమె భర్త సోమయ్య(72) నెలకు రూ.30 వేల చొప్పున భరణం ఇవ్వాలని సెప్టెంబరు 19న రాజీ కుదిరింది. పట్టువదలని విక్రమార్కుడిలా కుమారుడు చేసిన పోరాటంతో 30 ఏళ్ల తర్వాత ఆ తల్లికి న్యాయం జరిగినట్లయింది. స్వయంగా తన కుమారుడే కేసు వాదించి గెలవడంతో ఆ తల్లి చాలా సంతోషంతో అబ్బితుబ్బి అవుతుంది.
ఇవీ చదవండి: