Paddy Crop Damage in Telangana : అకాల వర్షాల ధాటికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ యాసంగిలో.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున కురిసిన భారీవర్షం.. పలు చోట్ల బీభత్సం సృష్టించింది. హనుమకొండ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్‌లో వరి తడిసి ముద్దైంది. జోరువాన, ఈదురుగాలుల ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. కాంటాలకు సిద్ధమైన ధాన్యం తడిసి ముద్దవడంతో.. అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Crop Damage due to Sudden Rains in Telangana : గన్ని సంచులు కాంటాలు, లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగబట్టినట్లుగా వర్షాలు కురవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నామని తెలిపారు. గతంలో పలుమార్లు కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోగా.. కొనుగోలు కేంద్రాల వద్ద మరోసారి పంట తడిసిపోవడంతో.. కన్నీటి పర్యంతం అవుతున్నారు. టార్పాలిన్ కవర్ల కొరత రైతుల కష్టాలను రెట్టింపు చేస్తోంది. చాలా చోట్ల టార్పాలిన్ పరదాలు లేక ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. త్వరితగతిన కాంటాలు జరిపినట్లయితే పంట తడిచేది కాదని రైతులు చెబుతున్నారు.
Farmers protest in Telangana : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో.. పరకాల మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. టార్పాలీన్లు సరిపడా లేకపోవడంతో నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్ లోని కొనుగోలుకేంద్రాల్లో వడ్లు జలార్పణమయ్యాయి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న నిల్వలు పూర్తిగా తడిచిపోయాయి. మక్కల్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
"ధాన్యం కాంటా వేసిన తర్వాత కూడా లారీలు లేక కొనుగోలు కేంద్రంలోనే ఉంచాం. 20 రోజులవుతోంది.. ఇప్పటికీ లారీలు రాలేదు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కనీసం టార్పాలిన్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా బతుకు బండి ఎట్లా కదిలేది..? మమ్మల్ని ఆదుకునేది ఎవరు..?"- స్థానిక రైతు
మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. వడ్లు తూకం వేసి 20 రోజులు గడిచాయని.. లారీలు రాక కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని.. నెన్నెల మండలం గొల్లపల్లి, మైలారంలోనూ లారీల కొరతతో.. ధాన్యం మిల్లులకు తరలించలేదు. వడ్లు తరలింపులో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇవీ చదవండి :