CJI Justice NV Ramana Warangal Tour: వరంగల్ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో లక్షా 23 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో నిర్మించిన ‘పది కోర్టుల’ న్యాయస్థానం భవనం నిర్మించారు. దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. సీనియర్ సివిల్ న్యాయస్థాన హాల్‌ను ‘పోక్సో’ కోర్టుగా మార్పు చేశారు. లైంగిక దాడుల కేసుల విచారణలో ఈ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యే బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు బయటి కక్షిదారులకు కనిపించకుండా ఉండేందుకు ప్రవేశద్వారాన్నే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కోర్టులోపలికి వెళ్లే దారి పొడవునా పూలమొక్కలు స్వాగతం పలికినట్లుగా తీర్చిదిద్దారు. వీరి విచారణ కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో సందేశాత్మక చిత్రాలను అందంగా తీర్చిదిద్దారు.
Multi Storied Court Building in Warangal: కోర్టులంటే బాధితులకు భయం తొలగిపోవాలని ఈ మార్పులు చేశారు. అంతేగాకుండా చిన్నారులు ఆడుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పర్యవేక్షణలో ఈ కోర్టును అత్యాధునికంగా రూపుదిద్దారు. నిర్మాణపరంగానే కాకుండా కక్షిదారుల సౌకర్యార్ధం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా కోర్టు భవనాలను నిర్మించారు. ప్రవేశ ద్వారం ఆకట్టుకునేలా కాకతీయుల స్వాగత తోరణాన్ని ఏర్పాటుచేశారు.
నేడు రామప్పను దర్శించుకోనున్న సీజేఐ
సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రానికి యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకుంటారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ దర్శనం అనంతరం సీజేఐ అక్కడి నుంచి రాత్రికి వరంగల్ చేరుకుని నిట్ అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం నగరంలోని భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత కోర్టు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నల్సార్ వర్సిటీ కార్యక్రమానికి వెళ్తారు.
ఇదీ చూడండి: CJI NV Ramana Warangal Tour: ఓరుగల్లు పర్యటనకు సీజేఐ.. రామప్ప ఆలయ సందర్శన