దొరల ఆగడాలను ఎదురించి నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ. పాలకుర్తి ప్రజలకు విస్నూరిదొర రామచంద్ర రెడ్డి నుంచి విముక్తి కల్పించిన ధీశాలి. పెత్తందారి, భుస్వామ్య వ్యవస్థలపై అలుపెరగని పోరాటం చేసిన సమరయోధురాలు. దొరలు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచడంలో పెద్దక్క పాత్ర పోషించింది.
ప్రస్తుత వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురంలో 1895లో జన్మించింది. పదమూడో ఏట ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. కుల వృత్తితో కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వ్యవసాయం చేయాలనుకుంది. ఆదే గ్రామనికి చెందిన కొండల్ రావు భూమిని కౌలుకు తీసుకొంది. ఐలమ్మ పొలంలోకి వెళ్లాలంటే పోలీస్ పటేల్ భూమి నుంచి వెళ్లాలి. వేరే దారి లేదు. ఇదే అదునుగా... మెుదటగా తన పొలంలో పని చేశాకే తర్వాత మీ భూముల్లో పనిచేసుకోవాలని పటేల్ శేషగిరిరావు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఐలమ్మ ధిక్కరించడంతోనే అసలు పోరాటం మెుదలైంది.
ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చి...
విస్నూరి దొర ఆగడాలను భరించలేక... దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆంధ్ర మహాసభలో చేరింది. పాలకుర్తి ప్రాంతంలో పార్టీ బలపడానికి ఐలమ్మ ఎంతో కృషి చేసింది. ఉద్యమంలో తన ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చింది. ఐలమ్మ భూమిలో పండిన పంటను దోచుకురమ్మని దేశ్ముఖ్...గుండాలను పంపించారు. ఆ సమయంలో ఆంధ్రమహాసభ ఆమెకు అండగా నిలిచింది. భీంరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు నాయకత్వంలో దేశ్ముఖ్ గుండాలను తరిమి ...పంటను ఇంటికి చేర్చారు.
ఐలమ్మ వల్ల తమ కోటలకు బీటలు పారుతున్నాయని కోపంతో... విస్నూరి రామచంద్ర రెడ్డి ఆమె కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఐలమ్మ భర్త నర్సయ్య, కుమారులు సోమయ్య, లచ్చయ్యలపై కుట్ర కేసులు పెట్టి జైలులో పెట్టించారు. తన కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు దేశ్ ముఖ్ గుండాలు. ఇలాంటి ఘటనలతో తన కుటుంబం మెుత్తం చిన్నభిన్నమైనప్పటికీ ... ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగింది. ఇలా ఐలమ్మ పోరాటం ఉద్ధృతమవడం వల్ల భూస్వాములంతా పట్నం బాట పట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసింది. చివరకు వృద్ధాప్యంలో అనేక ఇబ్బందులకు గురై 1985 సెప్టెంబర్ 10న కన్నుమూసింది.