Kadiam Srihari comments on reservations: పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఓవైపు రిజర్వేషన్లు పెంచకుండా ఉండటమే గాక.. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1961జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ఆనాడు రిజర్వేషన్లు కల్పించారని.. ఇన్నేళ్లలో జనాభా పెరిగినప్పటికీ రిజర్వేషన్లు పెంచటంలేదని విమర్శించారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుండటంతో కొత్తగా ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితిలేదని కడియం శ్రీహరి అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన కడియం.. భారత్ రాష్ట్ర సమితితోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ తన సత్తా చాటుతుందని చెప్పారు.
"1961 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభాకనగుణంగా రిజర్వేషన్లు పెంచాలి. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. 2021 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. భారత్ రాష్ట్ర సమితితోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది."- కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత
ఇవీ చదవండి: