జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం గ్రామ పంచాయతీలకే అప్పజెప్పిందని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న చెట్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని వెల్టూర్ నుంచి పెబ్బేరు మండలంలోని రంగాపురం వరకు మొత్తం 39 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని... ఇందుకు సంబంధించిన హరితహారం కార్యక్రమాన్ని జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలే నిర్వహించాలని ఆమె సూచించారు. గతంలో జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతలు అటవీ శాఖ వారు నిర్వహించేవారని తెలిపారు. ప్రస్తుతం అటవీ శాఖ వారికి నిధుల కొరత ఉండటం వల్ల అందుకు సంబంధించిన నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పజెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు.
రహదారి వెంట ఇరువైపుల మొక్కలను నాటాలని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలోని జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విస్తృతంగా చెట్లను నాటి రక్షించాలని ప్రజాప్రతినిధులకు జిల్లా పాలనాధికారికి సూచించారు. జిల్లా మొత్తంలోని 250 గ్రామ పంచాయతీల్లో, 5 మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సహకరించి మరింత వేగవంతంగా హరితహారం కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి; సీఎం కేసీఆర్ ఎక్కడున్నా... ఆరోగ్యంగా ఉండాలి : పొన్నం ప్రభాకర్