వనపర్తి పురపాలక కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి షేక్ యాస్మిన్ భాష ఉత్తర్వులు జారీ చేశారు.
వనపర్తి పురపాలిక పరిధిలో ధరణి సర్వే నిర్వహణ చురుగ్గా సాగడం పోవడం.. ఎన్యుమరేటర్లను నియమించకపోవడం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల నాలుగో తేదీ నుంచి పలుమార్లు సూచనలు చేసినా.. ధరణి సర్వేలో ముందడుగు కనిపించలేదని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో.. వనపర్తి జిల్లా కేంద్రంలోనే ఉండాలని, తన ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుడుగా ఉన్న మహేశ్వర్‌రెడ్డి.. గ్రూప్ పరీక్షల ద్వారా కమిషనర్‌గా నియమితులయ్యారు. మొదటి పోస్టింగ్‌ను జిల్లాలోనే దక్కించుకున్నారు. విధుల్లో చేరిన ఏడాదిలోపే సస్పెన్షన్‌కు గురయ్యారు.
కమిషనర్ సస్పెన్షన్‌పై పురపాలక సంఘం వర్గాల్లో పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పాలకవర్గంలోని కొందరితో కమిషనర్‌కు పొసగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమిషనర్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని జిల్లా పాలనాధికారికి విజ్ఞప్తి చేసినట్లు పురపాలక సంఘం అధ్యక్షుడు గట్టు యాదవ్ పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతోనే ధరణి సర్వేలో జాప్యం జరిగిందని తెలిపారు. వీటిని పరిశీలిస్తామని కలెక్టర్ అన్నారన్నారు.
ఇవీచూడండి: కేంద్రం మద్దతు ధర ఇస్తేనే రైతులకు ప్రయోజనం: నిరంజన్ రెడ్డి