Govardhanagiri road construction works delayed: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట-గోవర్ధనగిరి రెండు వరుసల రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా.. రహదారి నిర్మాణంలో వేగం పెరగట్లేదు. 2018లో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో తూముకుంట నుంచి గోవర్ధనగిరి వరకు 13.5 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభమయ్యాయి.
ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు: గోవర్ధనగిరిలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన గుత్తేదారు.. మిగతా రోడ్డు తవ్వి అక్కడక్కడ కంకర పరిచి వదిలేశారు. మట్టి రోడ్డు ఉన్న చోట్ల అసలు పనులే ప్రారంభించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర రోడ్డుపై ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు పాత రోడ్డును అలా ఉంచినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవర్ధనగిరి, తూముకుంట గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే అదే దగ్గరి దారి.
పెబ్బేరు నుంచి నాగర్ కర్నూల్, శ్రీశైలం, నానేపల్లి మైసమ్మ, సింగోటం జాతరకు వెళ్లేందుకు ఇదే సత్వర మార్గం. రోడ్డు నిర్మాణం పూర్తైతే.. చుట్టూ 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. కానీ.. ఏళ్లుగా రోడ్డును అసంపూర్తిగా వదిలివేయడంతో రవాణా దాదాపుగా స్తంభించింది. రోడ్డు బాగోలేకపోవడంతో ఆ మార్గంలో బస్సులను నిలిపివేశారు. ఆటోలు వెళ్లడం చాలా అరుదు. ద్విచక్ర వాహనదారులు ఆ మార్గాన్ని వినియోగిస్తున్నా.. కంకరపై అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వెల్లడించారు.
స్థానికులకు తప్పని తిప్పలు: అత్యవసర పరిస్థితుల్లో ఆ మార్గం వెంట వెళ్లక తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. 2018లో ప్రారంభమైన పనులు.. 2020 నాటికి పూర్తి కావాలి. పనులు పూర్తి చేయాల్సిన గుత్తేదారుకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు సైతం జారీ చేశారు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా ఓ వంతెన నిర్మాణాన్ని రోడ్లు, భవనాల శాఖ మరో కాంట్రాక్టరుకు అప్పగించింది. బీటీ రోడ్డు పనులు మాత్రం పాతగుత్తేదారే పూర్తి చేయాల్సి ఉంది.
రహదారి నిర్మాణంలో జాప్యం పట్ల అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. విసుగు చెందిన జనం.. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేను సైతం నిలదీశారు. ఎమ్మెల్యే చెప్పినా పనులు వేగం పుంజుకోవడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంట్రాక్టు రద్దు చేసి మరొకరికైనా అప్పగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి:.