కర్నూలు జిల్లా నుంచి ధాన్యం తెచ్చి... వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జప్తు చేశారు. పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి విజయ్‌కుమార్ (జయన్న) కర్నూలు జిల్లాలో ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా సూగూరుకు శనివారం తరలించారు. మొత్తం 460 సంచులు (ఒక్కో సంచి 70 కిలోలు) సూగూరు సింగిల్ విండో కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతు వేదిక సమీపంలో నిల్వ చేశారు.
గ్రామస్థులు అదనపు కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆయన గ్రామానికి చేరుకొని పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ డీఎం అనిల్‌కుమార్, తహసీల్దార్ ఘన్షీరామ్, ఇన్‌ఛార్జీ ఎస్సై రాముతో కలిసి విచారణ చేశారు. బస్తాలు 322 క్వింటాళ్లు ఉంటాయని అధికారులు గుర్తించారు. ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని రైతు వేదిక భవనంలోకి తరలించారు. పూర్తిస్థాయి విచారణ చేసి నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఎస్సైని ఆదేశించారు.