రైతులకు సాగుపై విజ్ఞానం పెంపొందిచడానికే రైతువేదికలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆధునిక వ్యవసాయాన్ని అందిపుచ్చుకునేందుకు ఇవి వేదికలు కావాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం, అంకూరు, బలిజపల్లి, పామిరెడ్డి పల్లిలో రైతు వేదికలను మంగళవారం ప్రారంభించారు.
సన్నకారు రైతులే ఎక్కువ
రైతుల అభివృద్ధి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి... రైతుబంధును ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు. 24 గంటల ఉచిత కరెంటుతో అన్నదాతలు ధీమాగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 63.25 లక్షల మంది ఈ వానాకాలం రైతుబంధు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. 98 శాతం వ్యవసాయ భూమి సన్న, చిన్నకారు రైతుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం అర్హులైన అన్నదాతలకే అందుతోందని అన్నారు.
ఎంత చేసినా తక్కువే..
గ్రామీణ సంతల కోసం ప్రత్యేక మార్కెట్ల ఏర్పాటుపై దృష్టి సారించామని వెల్లడించారు. గ్రామాల్లో కూరగాయల వినియోగం... ఆహార అలవాట్లలో నాణ్యత మీద ధ్యాస పెరిగిందన్నారు. కరోనా రాకతో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పోషకాలతో కూడిన ఆహారం ఉంటే చాలు అన్న ఆలోచన కలిగిందని తెలిపారు. మట్టిని నమ్ముకుని అన్నదాత సాగు చేస్తేనే ఎంతటి వారైనా తింటారని అన్నారు. అటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు. అన్నదాత బాగుంటేనే చుట్టూ ఉన్న వ్యవస్థలు బతుకుతాయన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
వనపర్తిలో కందకం వద్ద రూ.5 కోట్లతో నిర్మించే నాన్ వెజ్ మార్కెట్, బుగ్గపల్లి తండాలో రూ.86 లక్షలతో నిర్మించే 17 రెండు పడక గదుల ఇళ్లకు భూమిపూజ చేశారు. కిష్టగిరి తండాలో వైకుంఠధామం ప్రారంభించారు. పడమటి తండాలో రూ.2.46 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభించారు.
వీరాయపల్లిలో గోదాము
పెద్దగూడెంలో పాటు ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. రూ.కోటి వెచ్చించి ఖాన్ చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసి పెద్దగూడెం గ్రామానికి సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. వీరాయపల్లిలో 8700 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఇదీ చదవండి: Cm Kcr: ఊరంతా కలిస్తేనే అభివృద్ధి... అప్పుడే బంగారు వాసాలమర్రి సాధ్యం