ఒకేరోజు 50 లక్షల మంది రైతులకు... రైతుబంధు డబ్బులు విడుదల చేయడం ప్రపంచ రికార్డని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఏవైనా కారణాల వల్ల ఖాతాలో డబ్బులు పడని వారు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. జూన్ 16 వరకు పట్టాదారు పాస్ పుస్తకం పొందిన ప్రతి రైతుకూ... రైతుబంధు డబ్బులు ఇస్తామన్నారు.
వనపర్తి జిల్లా పాలనాధికారి కార్యాలయం కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారిక వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. హరితహారం మొక్కుబడిగా కాకుండా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆయన సూచించారు. వివిధ ప్రాజెక్టుల నిమిత్తం చేపట్టిన భూసేకరణకు సంబంధించి వారంలో సమస్యలన్ని పరిష్కరించి పూర్తి చేయాలని ఆదేశించారు. సహకార శాఖ పనితీరును కలెక్టర్.. ప్రతి నెలా సమీక్షించాలని కోరారు.
వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలలో పార్కులు, పారిశుద్ధ్య సమస్యలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని, వచ్చే ఆగష్టు 15 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ లోక్నాథ్ రెడ్డి హాజరయ్యారు.
ఇవీ చూడండి: 'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు'