వనపర్తి జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో, ఆధునిక సౌకర్యాలతో త్వరలోనే అద్భుతమైన సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేయనున్న ఆధునిక సమీకృత మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ మార్కెట్లో కూరగాయలతో పాటు, మాంసం, గుడ్లు, చేపలు, ఇతర అన్ని రకాల దినుసులు, ఇతర ఆహార పదార్థాలు దొరికేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేసే సమీకృత మార్కెట్ లో అన్ని హంగులు ఉండాలని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుగా జిల్లా కేంద్రాలలో అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్ ను నిర్మించాలన్నది ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే ఇదివరకే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలలో ఇలాంటి మార్కెట్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులు, ఇతరలు పాల్గొన్నారు.