గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించకుండా దేశాభివృద్ధి అనే మాట కేవలం నినాదంగా మిగిలిపోతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ముందరి తండా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి గ్రామం ఆర్ధికంగా పరిపుష్టి సాధించేలా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టిందని మంత్రి తెలిపారు. వ్యవసాయం, సంక్షేమంతో పాటు పల్లెల్లో ప్రకృతి సమతుల్యతను పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గ్రామగ్రామాన వేల సంఖ్యలో మొక్కలు నాటామని ఆయన అన్నారు.
పట్టణాలకు దీటుగా పల్లెలు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా పని చేస్తున్నారని.. దేశంలో ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరెక్కడా జరగడం లేదన్నారు.అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అనంతరం వనపర్తి మండలం అంకూర్ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.
ఇవీ చూడండి: ఎన్నిక ఏదైనా.. గెలుపు తెరాసదే కావాలి: మంత్రి పువ్వాడ