రాష్ట్రంలో హరితహారం కింద చేపట్టిన నర్సరీల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించారు. నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అంకూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. సాంకేతిక సహాయకుడిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
వనపర్తి, గోపాల్పేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న నర్సరీలను కలెక్టర్ తనిఖీ చేశారు. బ్యాగుల్లో నాటిన మొక్కలకు సంబంధించిన సమాచారం బోర్డులపై ఉండాలని నిర్వాహకులను ఆదేశించారు. ఏడాది నుంచి పెంచుతున్న మొక్కలు పూర్తిగా పెరిగి పనికిరాకుండా పోతాయని... వెంటనే వాటిని నాటాలని ఆదేశించారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించాలని సూచించారు.
నర్సరీ నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్దేశించిన మొక్కలు కాకుండా ఇతర మొక్కలు పెంచటం, నర్సరీ బెడ్ల నిర్వహణ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించినందుకు అంకూర్ పంచాయతీ కార్యదర్శి పృథ్వికి నోటీసులు జారీ చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. నర్సరీలో ఇతర మొక్కలతో పాటు, ఇంటి పెరట్లో నాటే పండ్లు, పూల మొక్కలు పెంచాలని చెప్పారు. ప్రతి ఇంటికి కనీసం ఆరు చొప్పన మొక్కలు పెంచాలన్నారు.
నర్సరీలో 22,000 మొక్కలు పెంచే లక్ష్యంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటి నిర్వహణలో సర్పంచ్‌కి బాధ్యత ఉంటుందని కలెక్టర్ చెప్పారు. వీటికి చుట్టూ కంచె, గేటు ఏర్పాటు చేయాలని యాస్మిన్ బాషా సూచించారు.
ఇదీ చదవండి: ఇండోర్ డ్రగ్స్ దందా రూ.100 కోట్లకు పైమాటే