CM KCR Speech BRS Public Meeting at Wanaparthy : తెలంగాణ ఏర్పడ్డాక ఈ పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. కొడంగల్‌కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు తనకు సవాల్ విసురడంపై స్పందించారు. ఈ విమర్శలకు విపక్షాలకు ఒకటే సమాధానం.. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారు.. వాళ్లతో తలపడాలని సున్నితంగా చెప్పారు. ఆనాడు తెలంగాణ కోసం తిరిగినప్పుడు కొందరు నేతల బూట్ల వద్ద కూర్చున్నారని.. వారు రాకున్నా... పిడికెడు మందిని పట్టుకుని పోరాడి తెలంగాణ సాధించానని కేసీఆర్ గుర్తు చేశారు.
'ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోంది. తెలంగాణ గురుకులాల్లో నేడు వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారు. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాము. రైతులకు ఏ ప్రభుత్వమైనా.. డబ్బులు ఎదురిచ్చిందా?. ఎన్ని మోటార్లు పెట్టారని నేడు రైతును ఎవరైనా అడుగుతున్నారా?. రైతులు కట్టాల్సిన రూ.లక్షల కోట్ల కరెంటు బిల్లులను ప్రభుత్వమే కడుతోంది. రైతుల భూమిపై రైతులకే అధికారం కట్టబెట్టాం. రైతులపై వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశాము. ధరణి వల్లే భూతగాదాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రైతుబంధు, దళిత బంధు(Dalit Bandhu)ను పుట్టించిందే కేసీఆర్. ఈ రెండు పథకాల ఆలోచనలు గతంలో ఎవరికైనా వచ్చిందా?. వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని' బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
"వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడు ఎవడు? ఎవరి కావాలో తేల్చాసింది మీరు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా ఆపే ప్రయత్నం చేస్తుందో చూశారు. ఒక్క మెడికల్ కాలేజీని అయిన మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చారా.. రైతుల భూములపై మొత్తం అధికారాన్ని వారికే ఇచ్చాము. అటువంటి ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ ఊరకనే మాట్లాడుతుంది. దళితబంధు అనే పథకాన్ని సృష్టించిందే కేసీఆర్. ఈసారి కచ్చితంగా వాల్మీకి హక్కుల కోసం పోరాడతాం." - కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
CM KCR Praja Ashirwada Sabha at Wanaparthy : తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని వనపర్తి ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. వనపర్తి ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉండేందని.. గత పదేళ్లలో ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూశారు కదానని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే.. జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు ఏ కాంగ్రెస్ నేత అయినా.. మెడికల్ కాలేజీ తెచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఐదు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.