గ్రామీణ ప్రాంతాల్లో వందల ఏళ్ల నుంచి గ్రామ దేవతను ఆరాధించడం ఆచారంగా వస్తోంది. ఆషాఢంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలతో పల్లె సందడిగా మారుతుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు నెల రోజుల పాటు భక్తి పారవశ్యంతో కొనసాగనున్నాయి. ప్రతి గ్రామంలో పోచమ్మ, ఊరడమ్మ దేవాలయాలతో పాటు మైసమ్మ, దుర్గమ్మ, గుండమ్మ, ఈదమ్మ, లక్ష్మమ్మ.. ఇలా వివిధ పేర్లతో అమ్మవార్లను కొలుస్తారు.
గ్రామాన్ని కాపాడే ఊరడమ్మ..
ప్రజలను కంటికి రెప్పలా ఎల్లప్పుడూ కాపాడుతుందనే నమ్మకంతో ‘ఊరడమ్మ తల్లి’ని కొలుస్తారు. గ్రామంలో నిర్ణయించిన రోజున ఆడపడుచులు తీపి వంటకాలతో బోనాలను తయారు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తీసుకెళ్లిన వంటకాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి.. కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటారు. ఇంటి దేవతగా పోచమ్మ తల్లిని ఆరాధిస్తారు.
అలంకరణే ప్రధానం..
బోనాల ఉత్సవంలో అలంకరణకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త కుండలకు కుంకుమ, పసుపుతో బొట్టు పెట్టి, వేపాకులతో అలంకరిస్తారు. కొత్తగా వివాహమైన ఆడ పిల్లలు పుట్టింటికి చేరుకొని.. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బోనాలను ఎత్తుకొని గ్రామ దేవతలకు సమర్పించి ఆశీర్వాదం కోరుతారు.
ఇదీ చూడండి: BONALU: ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!