నేర పరిశోధనలో పోలీసులు అలసత్వం ప్రదర్శించరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎం.నారాయణ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాండూర్, వికారాబాద్ సబ్ డివిజన్లు, కొడంగల్, పరిగి సర్కిళ్ల పోలీసు అధికారులు పాల్గొన్నారు. కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు.
2014 కంటే ముందు ఉన్న పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు తమ వద్ద ఉన్న సిబ్బందిని సక్రమంగా వినియోగించుకుని నేరాలను నివారించేందుకు కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డయల్ 100 కాల్ వచ్చిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లి వారి సమస్యలు తీర్చాలని తెలిపారు. ఎంవో అఫెండర్స్, పీడీ యాక్ట్, రౌడీ షీటర్లను రోజు తనిఖీ చేయాలని తెలిపారు. కేసుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎంఏ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.