మాయమాటలతో తమ కూమార్తెను తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్ చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆర్డీవోను ఆశ్రయించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్‌లో జరిగింది. ఈనెల 18న కళాశాలకు వెళ్లిన తమ కూతురిని నరేశ్ అనే యువకుడు తీసుకెళ్లాడంటూ తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్ట్ చేయకుండా ఎస్సై నిర్లక్ష్యం వహిస్తున్నాడని జిల్లాలోని యాలాల మండలం కూకట్ గ్రామానికి చెందిన మొగులయ్య, అతని భార్య ఆరోపిస్తున్నారు. తక్షణమే యువకుడిని అరెస్ట్ చేసి.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకుడు మల్లయ్య డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ కూతురిని అప్పగించి న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.
బాలిక ఇటీవలే ఆత్మహత్యకు యత్నించింది :
గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వెంకటేషశ్, నరేశ్‌లు మాయమాటలు చెప్పి ఈ నెల మొదటి వారంలో అనంతగిరి కొండలకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. బాలికతో అసభ్యకరమైన చిత్రాలు దిగి.. వాటిని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక ఈ విషయాన్ని అప్పట్లోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.